కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు మిస్టర్ 360 ఏబీ, తన రిటైర్మెంట్పై నిర్ణయం మార్చుకునే ఉద్దేశం తనకు ఏ మాత్రం లేదని తేల్చి చెప్పాడు. భారతదేశంలో అక్టోబర్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో అంతర్జాతీయ క్రికెట్లోకి తను తిరిగి అరంగ్రేటం చేస్తాడని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ మిస్టర్ 360 ఆటగాడి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా అభిమానుల ఆశలను నీరుకారుస్తూ తన నిర్ణయాన్ని వెనక్కు తీసకునేదే లేదంటూ ఏబీ డివిలియర్స్ స్పష్టతను ఇచ్చాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పాక పలు సందర్భాల్లో ఏబీ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తాడని పుకార్లు షికార్లు చేశాయి. ఇదే అంశంపై ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ మార్క్ బౌచర్ ఏబీని సంప్రదించగా, ఐపీఎల్ ముగిసాక తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పడంతో అభిమానుల ఆశలు సజీవంగా నిలిచాయి.
కాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల ఆశలను అడియాశలు చేస్తూ, తన రిటైర్మెంట్ నిర్ణయంపై తగ్గేదే లేదంటూ కుండబద్దలు కొట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన అతను, అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసి మరింతగా అలరిస్తాడని భావించిన ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు.
కాగా దేశంలో కరోనా ఉద్ధృతి కారణంగా ఈ సీజన్ ఐపీఎల్ ను ఉన్న పలంగా రద్దు కావడంతో స్వదేశానికి వెళ్లిన ఏబీడిని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సంప్రదించినప్పటికీ, తన నిర్ణయంలో మాత్రం మార్పు ఉండదని తేల్చేశాడు. దీంతో అతనిపైనే గంపెడాశలు పెట్టుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులో నిరాశే మిగిలింది.