బాలీవుడ్ నటుడు అభినవ్ శుక్లా తాజాగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు అందుకున్నట్లు స్వయంగా వెల్లడించాడు. ఎక్స్ (ట్విట్టర్) లో చేసిన పోస్టులో ఈ విషయాన్ని తెలియజేస్తూ.. తనకు, కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు.
ఈ బెదిరింపులకు సంబంధించిన వివరాలను పంజాబ్, చండీగఢ్ పోలీసులను ట్యాగ్ చేస్తూ షేర్ చేశాడు. అభినవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక అనుమానితుడు తనకు మెసేజ్ పంపుతూ “నేను బిష్ణోయ్ గ్యాంగ్‌లోని వ్యక్తిని. మీ ఇంటి అడ్రస్ నాకు తెలుసు. సల్మాన్ ఖాన్ ఇంటిపైన జరిగినట్లే మీ ఇంటిపైనా కాల్పులు జరుపుతాం” అంటూ హెచ్చరించినట్లు పేర్కొన్నాడు.
ఇటీవల అతని భార్య రుబినా దిలైక్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అసిమ్ రియాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అభినవ్ అసిమ్‌పై విమర్శలు చేయడం వల్ల ఈ బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నాడు. అసిమ్ ఫ్యాన్స్‌దే ఈ పని కావచ్చని అభిప్రాయపడ్డాడు.
ఈ మెసేజ్‌ను పంపిన వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ వివరాలను కూడా అభినవ్ షేర్ చేశాడు. తనకూ, కుటుంబానికీ ఆన్‌లైన్ బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించి చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను అభ్యర్థించాడు. ఇప్పటికే సల్మాన్ ఖాన్‌కు భద్రత పెంచిన నేపథ్యంలో.. అభినవ్ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో మరోసారి టెన్షన్ వాతావరణం సృష్టించాయి.