హైదరాబాద్: జూన్ నెల దగ్గర పడడంతో దీంతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. కరోనా కేసులు తగ్గుతాయా, లేదా, మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందా? జూలై నెల వరకు ఆగాలా? ఎలా ముందుకు సాగాలి? అన్న అంశాలపై తీవ్ర తర్జనభర్జనలు పడుతోంది.
ప్రతి సంవత్సరం సాధారణంగా జూన్ 12వ తేదీన కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. కాగా కరోనా కారణంగా క్రితం ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యింది. ఈసారి కూడా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖలో ప్రణాలిక ఎలా అనే ఆలోచన మొదలయ్యింది.
పరిస్థితులు అనుకూలిస్తే జూన్ నెలాఖరులో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలనే అభిప్రాయంతో ఉంది విద్యాశాఖ. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటేనే ప్రత్యక్ష బోధన ప్రారంభించేందుకు సాధ్యం అవుతుందని, లేదంటే జూలై వరకు ఆగాల్సి వస్తుందేమోనన్న భావనలో అధికారులు ఉన్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండేలా కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో 40,898 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిల్లో 59,26,253 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి బోధన ప్రారంభించే విష యంలో విద్యాశాఖ పలు ఆలోచనలు చేస్తున్నా, కరోనా కేసులను బట్టి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారమే ముందుకు సాగనుంది. ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించింది.