హైదరాబాద్ : తెలంగాణ కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఉదంతం మరవకముందే ఓ భూ వివాదంలో పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఆడియో టేపులతో సహా ఏసీబీకి అడ్డంగా పట్టుబడ్డారు. అదనపు కలెక్టర్ నగేష్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. మెదక్ జిల్లా నర్సపూర్ మండలం చిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్‌వోసీ ఇచ్చేందుకు రూ. కోటి 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.
దీంతో బుధవారం ఉదయం మాచవరంలోని నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లపై ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ నగేష్, ఒక ఎకరానికి లక్ష రూపాయల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. 15 రోజులుగా తిరుగుతున్నా పని కాకపోవడంతో హైదరాబాద్‌కు చెందిన మూర్తి ఏసీబీని ఆశ్రయించాడు.
దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ లంచం తీసుకుంటుండగా నగేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెదక్ మాచవరంలో లక్ష రూపాయల నగదుతో పాటు హైదరాబాద్ బోయినపల్లిలో లాకర్ ను గుర్తించారు. బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్ పేపర్లు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు మొత్తం ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.ఏసీబీ తనిఖీల్లో ఇంకా ఎన్ని ఆస్తులు బయటపడతాయనేది ఆసక్తిగా మారింది.