ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మీరట్‌లోని జాకీర్ కాలనీలో శనివారం సాయంత్రం మూడంతస్తుల భవనం కుప్పకూలిపోవడంతో 8 మంది మృత్యువాత పడ్డారు. శిథిలాల కింద 14 మంది చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది.
ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు వర్షంలోనూ సహాయక చర్యలను కొనసాగిస్తూ, శిథిలాలను తొలగిస్తున్నారు. ఇప్పటివరకు ఎనిమిది మందిని రక్షించగలిగారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. ఇంకా కొందరు శిథిలాల కింద ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ దీపక్ మీనా మాట్లాడుతూ, 14 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది, ఇప్పటివరకు 8 మందిని సురక్షితంగా బయటకు తీశామని చెప్పారు. మిగిలినవారిని రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.
ఇటువంటి ప్రమాదాలు ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. వర్షం తీవ్రతతో సహాయక చర్యలు కొంత కష్టతరం అవుతున్నప్పటికీ, తక్షణమే చర్యలు తీసుకుని బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై స్పందించి, బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని కూడా ఆయన సూచించారు.