టాలీవుడ్: కరోనా కారణంగా వచ్చిన గ్యాప్ ని చాలా మంది హీరోలు కథలు వినడానికి ఎక్కువ సమయం వెచ్చించినట్టున్నారు. దాని ఫలితం ఇపుడు కొట్టచ్చినట్టు కనపడుతుంది. ఎన్నడూ లేనంతగా పెద్ద హీరోల నుండి చిన్న హీరోల వరకు వరుస పెట్టి కొత్త సినిమా ప్రకటనలు మరియు సినిమా షూటింగ్ ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ఇదే కోవలో విలక్షణ నటుడు ‘శ్రీ విష్ణు‘ కూడా ఉంటాడు. కారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో చాలా సినిమాల్లో నటించి మెల్ల మెల్లగా హీరో గా నిలదొక్కుకుంటున్నాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘నీది నాది ఒకే కథ’ , ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు మాత్రమే కాకుండా సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ వస్తున్నాడు.
ప్రస్తుతం హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజా రాజా చోర’ అనే సినిమాలో ఈ హీరో నటిస్తున్నాడు. ఇది దాదాపు షూటింగ్ చివరికి వచ్చింది. దీనితో పాటు కామెడీ జానర్ లో టాప్ మోస్ట్ డైరెక్టర్ ‘అనిల్ రావిపూడి’ నిర్మాణంలో ‘గాలి సంపత్’ అనే ఒక సినిమా కూడా చేస్తున్నాడు. ఇవి మాత్రమే కాకుండా ఈ హీరో ప్రస్తుతం మరో సినిమా ప్రకటించాడు. లక్కీ మీడియా బ్యానర్ లో బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మించనున్నాడు. ఈ సినిమా ద్వారా ప్రదీప్ వర్మ అల్లూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ హీరో దగ్గరినుండి కూడా వచ్చే సంవత్సరం ఎంత కాదన్నా మూడు సినిమాలు విడుదల అవుతాయి.