తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటవుతున్న స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రూ.100 కోట్ల విరాళం అందజేశారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గౌతమ్ అదానీ స్వయంగా కలసి చెక్కును అందించారు.
ఈ విరాళం అదానీ ఫౌండేషన్ తరఫున ఇవ్వబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో బేగరికంచెలో ఉన్న స్కిల్ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఈ యూనివర్సిటీ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణను అందించి, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలను సులభతరం చేయడం లక్ష్యంగా ఉంది.
ప్రస్తుతం 17 రకాల కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించనుండగా, రానున్న రోజుల్లో ప్రతి ఏడాది లక్ష మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇప్పటి వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవనంలో యూనివర్సిటీ కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి. ముచ్చర్లలో సొంత భవనం పూర్తి అయిన తర్వాత అక్కడ అన్ని సదుపాయాలతో యూనివర్సిటీని ప్రారంభిస్తారు.