అదానీపై అమెరికాలో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. 265 మిలియన్ డాలర్ల లంచాలు, తప్పుడు సమాచారంతో నిధుల సేకరణ అనేది ఆరోపణ.
అంతర్జాతీయం: న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో భారత బిలియనీర్, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై మోస ఆరోపణలు నమోదయ్యాయి. గౌతమ్ అదానీతో పాటు ఆయన బంధువు సాగర్ అదానీ, మరో ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రాసిక్యూటర్ల ఆరోపణల ప్రకారం, అదానీ గ్రూప్ 20 ఏళ్ల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచాలు చెల్లించింది. ఈ లంచాల సమాచారం మదుపరుల నుంచి దాచిపెట్టి, తప్పుడు వివరాలు అందించడం ద్వారా బిలియన్ డాలర్ల నిధులు సమీకరించిందని న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు తెలిపారు.
అదానీ గ్రీన్ ఎనర్జీ అక్రమ మార్గాల్లో రుణాలు, బాండ్ల రూపంలో 3 బిలియన్ డాలర్లకు పైగా నిధులు సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా అమెరికా, అంతర్జాతీయ మదుపరులను తప్పుదారి పట్టించడమే కాకుండా, వారి నిధులను తమ వ్యాపారానికి ఉపయోగించుకున్నట్లు భావిస్తున్నారు.
ఇంకా, అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) అదానీ గ్రీన్ ఎనర్జీపై మరో సివిల్ కేసు నమోదు చేసింది. యూఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి 175 మిలియన్ డాలర్లకు పైగా నిధులను సమీకరించిందని SEC ఆరోపిస్తోంది. దర్యాప్తు అనంతరం జరిమానాలు, ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్ కోర్టును కోరింది.
ఈ ఆరోపణలపై గౌతమ్ అదానీ లేదా అదానీ గ్రూప్ నుంచి ఇంకా స్పందన రాలేదు. ఈ కేసులు అదానీ వ్యాపారంపై ఎంత మేరకు ప్రభావం చూపుతాయో అనేది వేచి చూడాలి.