ఆంధ్రప్రదేశ్: ఏపీ వరద బాధితులకు ఆదానీ గ్రూప్ భారీ విరాళం
కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి. విజయవాడ, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ సమయంలో ప్రజలకు అండగా ఉండేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారస్తులు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందిస్తున్నారు. తాజాగా, అదానీ గ్రూప్ తమ వంతుగా సీఎం సహాయనిధికి రూ. 25 కోట్ల విరాళాన్ని అందించింది.
గౌతమ్ అదానీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విరాళానికి సంబంధించిన చెక్‌ను అందజేశారు. వర్షాలు, వరదలు ముప్పతిప్పలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సహాయం చేస్తున్నామన్నారు. వర్షాల ధాటికి క్షతగాత్రులైన ప్రజలకు అండగా ఉంటామని గౌతమ్ అదానీ పేర్కొన్నారు.
ఈ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 40 మంది ప్రాణాలు కోల్పోగా, వందల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. వర్షాలు మరియు వరదల వల్ల ఏర్పడిన నష్టాన్ని భరించేందుకు రాష్ట్రానికి విరాళాల వెల్లువ కొనసాగుతుంది. ఇప్పటికే సీఎం సహాయనిధికి సుమారు రూ. 350 కోట్లు విరాళాలు వచ్చినట్లు సమాచారం.