అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఏ మాత్రం లేదని ఏపీ నూతన సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు సీఎస్ రాసిన లేఖలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన తన లేఖలో కోరారు.
ఏపీలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి రెండు డోసుల వ్యాక్సిన్ అవసరం. మొదటి డోస్‌కు, రెండవ డోస్‌కు 4 వారాల వ్యవధి అవసరమని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తయ్యాక, 60 రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం.
మొదటి విడతలోనే ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ తప్పనిసరని కేంద్రం తెలియజేసింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదు. ఇలా చేస్తే కేంద్రప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లే అన్నారు. ఎన్నికలు, వ్యాక్సినేషన్ ప్రక్రియలు రెండూ సజావుగా జరగాలని హైకోర్టు సూచించింది.
హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని సీఎస్ తన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశామని, సుప్రీంకోర్టులో విచారణ ముగిసేవరకు ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్లొద్దని సీఎస్ ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.