నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న ఆదిత్య 369 మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1991లో విడుదలైన ఈ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ సినిమా, అప్పట్లోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, తెలుగులో తొలిసారిగా టైమ్ మిషన్ కాన్సెప్ట్‌ను ప్రెజెంట్ చేసింది.
బాలకృష్ణ ద్విపాత్రాభినయం, ఇళయరాజా సంగీతం, వినూత్నమైన కథనంతో ఆదిత్య 369 అప్పట్లోనే ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను 4K రీ-మాస్టర్ చేసి, ఏప్రిల్ 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.
33 ఏళ్ల తర్వాత ఈ విజువల్ వండర్‌ను 5.1 సౌండ్‌తో మళ్లీ తెరపై చూపించేందుకు శ్రీదేవి మూవీస్ ప్రత్యేకంగా ప్రయత్నిస్తోంది. అప్పట్లో కేవలం 1.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఆ కాలంలో భారీ లాభాలను అందించింది. తెలుగులో ఓ క్రేజీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, అప్పట్లో వీసీఆస్ మార్కెట్‌లోనూ విపరీతమైన డిమాండ్‌ను సొంతం చేసుకుంది.
బాలకృష్ణ ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆదిత్య 999 అనే టైటిల్ ఇప్పటికే లాక్ చేసినట్లు బాలయ్య ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారు. ఇది నిజమైతే, తెలుగులో మరో సైన్స్ ఫిక్షన్ మైల్‌స్టోన్ రాబోతుందని చెప్పొచ్చు.
ఇకపోతే, శ్రీదేవి మూవీస్ బ్యానర్ మరో సినిమా సారంగపాణి జాతకం ఏప్రిల్ 18న విడుదల చేయనుంది. మొత్తానికి, ఈ వేసవిలో ఆదిత్య 369 రీ-రిలీజ్ తెలుగు ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇవ్వనుందని చెప్పొచ్చు.