అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నివర్ తుపాను ప్రభావం వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్ పర్యటనకు బయలుదేరారు. శనివారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన ఏపీ సీఎం గన్నవరం విమానశ్రయం నుంచి నేరుగా చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారు.
చిత్తూరు నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా ఆయన పరిశీలించనున్నారు. తరువాత రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సీఎం తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. అయితే, తుపాను ప్రభావంతో శుక్రవారం కూడా రాష్ట్రంలో పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి.
నివర్ తుపాన్ ఏరియల్ సర్వే అనంతరం సీఎం వైఎస్ జగన్ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో భేటీ కానున్నారు. తుఫాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టాలపై చర్చించనున్నారు.
అదే విధంగా వివిధ శాఖల అధికారులు నివేదికలతో సహా ఇప్పటికే ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. సీఎంతో భేటీలో వరద నష్టాలను ప్రజాప్రతినిధులు సీఎం జగన్ దృష్టికి తేనున్నారు. కాగా, ఇప్పటికే మంత్రి అనిల్ కుమార్ యాదవ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, చెవిరెడ్డి, బియ్యపు మధుసూధన్‌రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఎంఎస్ బాబు, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఆదిమూలం సురేష్ తదితరులు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.