మూవీడెస్క్: తెలుగులో తొలి స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు పొందిన ఆహా, ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది.
తెలుగు మరియు తమిళ భాషల్లో విస్తరించిన ఈ సంస్థకు అన్‌స్టాపబుల్ వంటి షోలు మంచి పాపులారిటీ తీసుకొచ్చాయి.
కానీ అధిక నిర్వహణ ఖర్చులు, తగిన ఆదాయ వృద్ధి లేకపోవడం వల్ల ఆహా ఆర్థికంగా కుదేలవుతోంది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆహా మొత్తం రూ. 137 కోట్ల ఆదాయం సాధించగా, ఖర్చులు రూ. 277 కోట్లకు చేరాయి.
ఈ నేపథ్యంలో సంస్థకు రూ. 105 కోట్ల నష్టాలు నమోదయ్యాయి.
గత ఏడాది 2022-23లో ఈ నష్టాలు రూ. 120 కోట్లుగా ఉండగా, ఇప్పుడు పదమూడు శాతం మేర తగ్గడం సంస్థకు కొంత ఊరటనిచ్చింది.
ఇక ఆదాయ వృద్ధి విషయానికొస్తే, 2022-23లో రూ. 122 కోట్లుగా ఉన్న ఆదాయం, 2023-24లో రూ. 137 కోట్లకు పెరిగింది. అంటే తొమ్మిది శాతం వృద్ధి కనిపించింది.
ఇది సంస్థ భవిష్యత్తులో నిలకడగా ముందుకు సాగేందుకు ఒక చిన్న ఆశగా చెప్పవచ్చు.
అయితే, బడ్జెట్ కంటెంట్, సబ్‌స్క్రిప్షన్ రేట్ల పెంపు, ఖర్చుల నియంత్రణ వంటి చర్యల ద్వారా ఆహా తన నష్టాలను మరింత తగ్గించుకోవాలని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగులో బలమైన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా ఆహా మరింత పటిష్ఠమవ్వాలంటే ఆర్థిక పరంగా కచ్చితమైన ప్రణాళికలు అవసరం.