న్యూఢిల్లీ: ప్రపంచంలో టెక్నాలజీ పరంగా విప్లవాత్మక మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రతి రంగాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. దీనిలో భాగంగానే విద్యా రంగంలోనూ సమూల మార్పులు వస్తున్నాయి.
భారత దేశంలో ఇంజనీరింగ్ విద్యను పర్యవేక్షించే ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ), బీటెక్ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త కోర్సులను ఈ సంవత్సరం నుండే ప్రవేశపెట్టింది.
తాజాగా ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్ విద్యలో ఇలాంటి నూతన కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. తెలుగు రాష్టాల్లోనూ పలు కాలేజీల్లో బీటెక్ స్థాయిలో ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
డేటా సైన్స్
నైపుణ్యం కలిగిన డేటా సైంటిస్టులను తయారు చేయడానికి ఇంజనీరింగ్ విద్యలో డేటాసైన్స్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. రంగం ఏదైనా, జరగబోయే పరిణామాలను ముందే అంచనా వేసి కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని అందించే టెక్నాలజీనే డేటాసైన్స్.
సైబర్ సెక్యూరిటీ
నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ/ప్రైవేట్, వ్యాపార సంస్థలు సహా ప్రతీ రంగంలో లావాదేవీలన్నీ ఇంటర్నెట్ ఆధారంగానే జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా లావాదేవీలు, సంబంధిత సమాచార భద్రత అనేది చాలా క్లిష్టంగా మారింది. ఇటువంటి విలువైన సమాచారాన్ని భద్రపరచడానికి రక్షణ కవచంగా వచ్చిందే..సైబర్ సెక్యూరిటీ.
బ్లాక్ చైన్ టెక్నాలజీ
ఇంజనీరింగ్‌లో కొత్తగా ప్రవేశ పెట్టిన మరో కోర్సు.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ. సైబర్ నేరాలను ఆరిక ట్టడానికి ఆయా వ్యవస్థలపై పనిచేసే నిపుణులు ఎప్పటికప్పడు నూతన పరిజ్ఞానాన్ని అందుబా టులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చిందే బ్లాక్‌చైన్ టెక్నాలజీ. ఆర్థికపరమైన లావాదేవీలల్లో పారదర్శకతను పెంచేవిధంగా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఆన్‌లైన్ ఆధారంగా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
సాంకేతిక రంగంలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్. మానవ ఆలోచనలకు అనుగుణంగా కంప్యూటర్ ఆధారిత యంత్ర వ్యవస్థ పనిచేసేలా చేయడమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఇప్పుడు ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఏఐలో స్పీచ్ రికగ్నిషన్, విజువల్ పర్సెప్షన్, లాజిక్ అండ్ డెసిషన్, మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ లాంటి చాలా అంశాలుంటాయి. రోబోటిక్స్‌లోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం కీలకం.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంగా మార్చేసిన ఘనత ఇంటర్నెట్‌కు దక్కుతుంది. సమాచార వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మ కతకు ముఖ్య కారణం ఇంటర్నెట్ అనడంలో సందేహం లేదు. దీని విస్తృతి మరింత పెరిగి.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) తెరపైకి వచ్చింది. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులో ఐఓటీ కూడా ఒకటి.
బిజినెస్ అనలిటిక్స్
ఒకప్పుడు వ్యాపార సంస్థల మధ్య పోటీ తక్కువగా ఉండేది. కొన్ని సంస్థల గుత్తాధిపత్యం కొనసాగేది. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో.. వ్యాపార సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో ఆయా వ్యాపారాలను లాభాల బాటలో తీసుకేళ్లేందుకు అందరూ బిజినెస్ అనలిటిక్స్ సహాయం తీసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం బడా కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకూ.. లక్షల్లో జీతాలు ఇచ్చి బిజినెస్ అనలిటిక్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి. దీంతో బిజినెస్ అనలిటిక్స్‌కు బాగా డిమాండ్ ఏర్పడింది.
బయో మెడికల్ ఇంజనీరింగ్
బయోమెడికల్ ఇంజనీంగ్ ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్న కోర్సులో ఒకటి. ఆరోగ్య రంగానికి సాంకేతిక తోడ్పాటు అందించేందుకు ఈ విభాగం కృషి చేస్తోంది. బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రధానంగా రోగ నిర్ధారణకు సంబంధించి ఉపయోగించే పరికరాలను తయారు చేస్తుంది.