హైదరాబాద్: భారత్ నుండి ఇతర దేశాలతో విమాన ప్రయాణ సౌకర్యాలు తిరిగి ప్రారంభించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆగస్టు 17 నుంచి భారత, యూకే ప్రభుత్వాల మధ్య కుదిరిన ‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ ఒప్పందం ప్రకారం జీఎమ్‌ఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ హీత్రో విమానాశ్రయానికి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.
కరోనా మహమ్మారి నేపథ్యంలో కోలుకుంటున్న పౌర విమాన రంగానికి ఈ చర్య చాలా ఊతమిస్తుంది. హైదరాబాద్, లండన్ మధ్య సర్వీసులను పున: ప్రారంభిస్తూ హైదరాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌లోని హీత్రో విమానాశ్రయానికి సోమవారం ఉదయం 7.50 గంటలకు బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన (బీఏ 276) బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానాశ్రయం బయలుదేరింది.
హైదరాబాద్, లండన్‌ల మధ్య తిరిగి సర్వీసులు ప్రారంభం కావడం వల్ల ప్రజలను, సరుకులను ఒక చోటి నుంచి మరో చోటికి తరలించడం జరిగి ఆర్థిక, సామాజిక సంబంధాల పునరుద్ధరణకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. కోవిడ్ మహమ్మారి కారణంగా దెబ్బ తిన్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి భారత ప్రభుత్వం అన్‌లాక్ 3.0 సందర్భంగా, వివిధ దేశాలతో ‘‘ట్రాన్స్‌పోర్ట్ బబుల్స్, ‘‘వాయు రవాణా ఒప్పందాలు అనే తాత్కాలిక ఏర్పాట్లకు అనుమతించింది.
దీని కింద ఏవైనా రెండు దేశాలు కోవిడ్-19 మహమ్మారి కారణంగా రద్దైన సర్వీసులను పున: ప్రారంభించుకోవచ్చు. మే 25న హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు పున:ప్రారంభమైన నాటి నుంచి జీఎమ్‌ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం సురక్షితమైన ప్రయాణం కొరకు డిపార్చర్ ర్యాంప్ నుంచి బోర్డింగ్ గేటు వరకు పూర్తి శానిటైజ్ చేయబడిన కాంటాక్ట్-లెస్‌తో ప్రయాణికుల భధ్రతకు భరోసా కల్పిస్తుంది.