ముంబై: బయోపిక్, పీరియాడిక్ సినిమాలు, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వచ్చే సినిమాలు ఇప్పుడు ఇదే ట్రెండ్, ఇదే హిట్ ఫార్ములా. ఈ ఫార్ములా తో ఇప్పటివరకు చాలా సినిమాలే వచ్చి హిట్ అయ్యాయి. దంగల్, భాగ్ మిల్కా బాగ్, గోల్డ్, చక్ దే ఇండియా లాంటి సినిమాలు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వచ్చి కమర్షియల్ హిట్స్ గానే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందాయి. ఇపుడు అదే కోవలో వస్తున్న మరో సినిమా అజయ్ దేవగన్ నటించిన ‘మైదాన్’.
1952 – 62 మధ్య కాలంలో భారత ఫుట్ బాల్ ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ జీవితకథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ‘బదాయి హో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ ప్రియమణి ‘మైదాన్’ లో హీరోయిన్ గా నటిస్తోంది. పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ గజరాజ్ రావు ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాని 2021 ఆగస్టు 13న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు అజయ్ దేవగణ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
”2021 ఇండిపెండెన్స్ వీక్. ఇప్పటి వరకూ చెప్పని, ప్రతి ఇండియన్ గర్వపడే స్టోరీ ఇది. ఆగస్టు 13వ తేదీని మార్క్ చేసి పెట్టుకోండి” అని అజయ్ దేవగన్ ట్వీట్ చేసారు. ‘మైదాన్’ మూవీని ఫ్రెష్ లైమ్ ఫిల్మ్ సహకారంతో జీ స్టూడియోస్ బ్యానర్ పై బోనీ కపూర్ – ఆకాష్ చావ్లా – అరుణవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. ఇక ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతల్లో ఒకరైన బోనీ కపూర్ ప్రకటించారు. క్రీడా నేపధ్యం తో వచ్చే సినిమాలు బాషా బేధం లేకుండా ఆడతాయని ఇదివరకే రుజువైంది. ఈ సినిమా కూడా హిందీతో పాటు తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదల కానుంది.