టాలీవుడ్: తెలుగు నుండి వస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో మొదటగా చెప్పుకోవాల్సించి రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్ఠీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న RRR సినిమా. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించే సినిమా అవడం, టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ పొజిషన్ లో ఉన్న ఇద్దరు హీరోలు మొదటి సారి కలిసి నటించడం, స్వాతంత్య్రానికి ముందు జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా జనాలకి బాగా తెలిసిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం లాంటి పేర్లతో సినిమాని రూపొందిస్తుండడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశాలు. ఇవే కాకుండా ఈ సినిమా నుండి విడుదలైన పాత్రల పరిచయాల టీజర్స్ కి అశేష స్పందన రావడమే కాకుండా సినిమాపై అంచనాలని ఆకాశానికెత్తాయి.
ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీ గా సీత పాత్రలో ఆలియా భట్ నటిస్తుంది. ఈరోజు ఆలియా భట్ పుట్టిన రోజు సందర్భంగా RRR సినిమా లో సీత పాత్రకి సంబందించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది సినిమా టీం. పోస్టర్ ని బట్టి చూస్తే రామరాజు కోసం ఎదురు చూస్తే సీత పాత్రలో ఆలియా కనిపించబోతున్నట్టు అర్ధం అవుతుంది. ఆలియా కి తెలుగులో ఇది మొదటి సినిమా. ఈ సినిమాతో పాటు ఆలియా బాలీవుడ్ లో సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో గంగూభాయ్ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ లో కూడా నటిస్తుంది. అక్టోబర్ 13 న విడుదలకి సిద్ధం చేస్తున్న RRR సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ షూట్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ని తీసుకువచ్చారు రాజమౌళి.