మూవీడెస్క్: ఈ శుక్రవారం అక్టోబర్ 11 విడుదల కాబోతున్న విశ్వం పై భారీ అంచనాలేమీ లేకపోయినా, పండగ సీజన్ లో మంచి ఎంటర్‌టైనర్ అవుతుందనే నమ్మకం మాత్రం ఉంది.
ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ శ్రీను వైట్లకు కంబ్యాక్ అవ్వాల్సిన కీలక చిత్రం.
గతంలో ఎన్నో బ్లాక్‌బస్టర్లు అందించిన ఆయన, కొన్నేళ్లుగా ఫ్లాప్‌లలో ఉన్నాడు.
ఈ సారి కామెడీ, మాస్, యాక్షన్ వంటి అంశాలను సరిగ్గా మిక్స్ చేసి ప్రేక్షకులని ఆకట్టుకుంటాననే నమ్మకంతో ఉన్నారు.
హీరో గోపీచంద్ కూడా ఈ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి రావాలి.
మాస్ ఫాలోయింగ్ ఉన్నా, సరైన టీమ్, కథ దొరకకపోవడంతో ఆయన గత చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయాయి.
భీమా వంటి రొటీన్ సినిమాలు కూడా కొన్ని వసూళ్లు సాధించగలిగాయి అంటే గోపీచంద్ బ్రాండ్ ఇమేజ్ కి గల ప్రాముఖ్యత తెలియజేస్తుంది.
ఇప్పుడు విశ్వం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, ఆయన కెరీర్ కు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది.
ఇక హీరోయిన్ కావ్య థాపర్ కూడా ఈ సినిమా విజయంపై ఆధారపడి ఉన్నారు. భైరవకోన వంటి డీసెంట్ హిట్ ఉన్నా, ఆమెకు భారీ హిట్టు అందడం లేదు.
మరోవైపు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టిజి విశ్వప్రసాద్‌కు కూడా ఈ సినిమా చాలా ముఖ్యమైంది. గత రెండు చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయాయి.
ఇక విశ్వం విజయం సాధిస్తే ఆ నిర్మాణ సంస్థకు ఊరట దక్కుతుంది.