హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది.
ఈ పరిణామంపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు, చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ, రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అల్లు అర్జున్ అరెస్టు అంశాన్ని చర్చకు తీసుకువచ్చారని విమర్శించారు. పేదలకు పట్టించుకోని రేవంత్ పెద్దల రాజకీయాలకు దాసోహం అయ్యారని ఆమె ఆరోపించారు.
గురుకులాల్లో చనిపోయిన విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించిన కవిత, అలాంటి అంశాలపై రేవంత్ మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ బీజేపీ చేతుల్లో నడుస్తోందని, ఇది ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టే ప్రయత్నమని మండిపడ్డారు.
ప్రజా సమస్యలపై కాకుండా రాజకీయ కక్షలపై ఎక్కువగా దృష్టిపెడుతున్న ప్రభుత్వం ప్రజలకు నష్టం చేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.