హైదరాబాద్: ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన మరింత సీరియస్ గా మారింది. హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడంతో, చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు.
అల్లు అర్జున్ ను హైదరాబాద్ లోని తన నివాసం నుంచి స్టేషన్‌కు తరలించారు. నవ్వుతూ పోలీసుల వాహనంలోకి ఎక్కిన బన్నీ ఈ కేసులో ఏ2గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం, బన్నీపై నమోదు చేసిన సెక్షన్లు స్టేషన్ బెయిల్‌కు అనుకూలంగా లేవని తెలుస్తోంది. నేరం రుజువైతే గరిష్టంగా కొంతకాలం జైలు శిక్ష ఎదురయ్యే అవకాశముంది.
ఈక్రమంలోనే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించి, కేసు కొట్టివేయాలని పిటిషన్ వేశారు. అయితే, హైకోర్టులో ఆయనకు ఊరట లభించలేదు.
ఇక, ఈ ఘటనపై థియేటర్ మేనేజర్ తో పాటు సిబ్బందిపై కేసు నమోదైంది. ఇప్పటికే థియేటర్ మేనేజర్ జైలుకు వెళ్లగా, పోలీసులు అల్లు అర్జున్ ను కోర్టులో హాజరుపరచే అవకాశముంది.