టాలీవుడ్: ‘ప్రేమించడం అంటే ప్రేమిస్తూనే ఉండడం’ అనే టాగ్ లైన్ తో ఇవాళ ‘ఆహా’ ఓటీటీ లో విడుదలైన సినిమా ‘అమరం అఖిలం ప్రేమ‘. బాగా చదువుకునే ఒక నాన్న కూచి అయిన అమ్మాయి, ఆవారా గా తిరిగే ఒక అబ్బాయి, మొదట అసలు కన్నెత్తి కూడా చూడకుండా తర్వాత ఆ అబ్బాయే కావాలనే స్టేజ్ కి వచ్చిన అమ్మాయి. మొత్తం గా చెప్పాలంటే కథ ఇంతే. కానీ ట్రీట్మెంట్ బాగుందని చెప్పచ్చు. ఇంకోరకంగా చెప్పాలంటే లవ్ స్టోరీల్లో ఉండే అడ్వాంటేజ్ అది. ఒక కథను ఎన్ని సార్లైనా చెప్పొచ్చు కానీ చెప్పే విధానం కొత్తగా అనిపిస్తే ప్రేక్షకులు ఆ సినిమాని నెత్తిన పెట్టుకుంటారు.
ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి ప్రేమ కథ అని చెప్పడం కన్నా కూడా ఒక తండ్రి, కూతురి మధ్య ఉండే ప్రేమని గొప్పగా చెప్పారు అని చెప్పొచ్చు. రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఇష్టంగా తిరిగే కుర్రాడిగా హీరో పరిచయం, హీరోయిన్ కనపడగానే ఆమెని ఫాలో అవడం, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లడం, ఆమె ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టడం ఇలా ఫస్ట్ హాఫ్ అంత రొటీన్ గా సాగిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ దగ్గరినుండి ప్రేక్షకుడు సినిమాలో లీనం అవుతారు. తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న అనుబంధాన్ని అదే దశలో హీరో పై ప్రేమ ఎలా మొదలవుతుంది అనేది చాలా చక్కగా హేండిల్ చేసాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ కూడా ఇంకొంచెం ట్రై చేసుంటే సినిమాకి ఇంకా మంచి రెస్పాన్స్ ఉండేది. ఐతే తండ్రి కూతుళ్ళ మధ్య వచ్చిన సమస్య ఏంటి, దానికి హీరోకి సంబంధం ఏంటి, దాన్ని హీరో ఎలా పరిష్కరించగలిగాడు, తన ప్రేమని ఎలా గెలుచుకున్నాడు అనే విషయం లో డైరెక్టర్ పద్దతిగా తియ్యగలిగాడు.
సినిమాలో నటీ నటుల విషయానికి వస్తే తండ్రి పాత్రలో నటించిన ‘శ్రీకాంత్ అయ్యంగార్’ ఆకట్టుకున్నాడు. తండ్రి పాత్రల్లో తెలుగులో వచ్చిన ‘నువ్వే నువ్వే’ లాంటి సినిమాని పోలిన క్యారెక్టర్ లో బాగా చేసాడు. హీరోగా నటించిన విజయ్ రామ్ తన పాత్రకి న్యాయం చేసాడు. ఎక్కడ ఓవర్ అవలేదు అలా అని అసలు ఏమీ చేయలేదు అనడానికి కూడా లేదు. తన పాత్ర వరకు తాను ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో నటించిన ‘శివ శక్తి’ మాత్రం ఈ పాత్రకి సరిగ్గా సరిపోయింది అని చెప్పుకోవచ్చు. తన లుక్స్ కానీ , కాస్ట్యూమ్స్ కానీ, తన యాక్టింగ్ కానీ అన్ని విషయాల్లో ఈ పాత్రకి సరిగ్గా సరిపోయింది. ఒక కొత్త యాక్టర్ అని చెప్పడం కన్నా కొంచెం అనుభవం ఉన్న యాక్టర్ లాగా చేసింది. హీరో తండ్రి పాత్రలో చేసిన నరేష్ , హీరోయిన్ బామ్మ గా చేసిన అన్నపూర్ణమ్మ తమ తమ పాత్రల్లో బాగానే చేసారు.
ఓవరాల్ గా చెప్పాలంటే ‘అమరం అఖిలం ప్రేమ‘ ఒక పరిణతి చెందిన ప్రేమ కథ అని చెప్పుకోవచ్చు.