ఆంధ్రప్రదేశ్: రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కోర్ కేపిటల్‌గా అభివృద్ధి చేస్తున్న 33 వేల ఎకరాలకు అదనంగా మరో 30 వేల ఎకరాల భూసేకరణకు సర్కార్ సిద్ధమవుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఈ భూములను ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్‌లు, ఐటీ జోన్‌లు, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, గ్రీన్ బెల్ట్, ఎయిర్‌పోర్ట్ విస్తరణ తదితర మౌలిక వసతుల కోసం వినియోగించనున్నారు. అమరావతిని అఖండంగా, సమగ్రంగా తీర్చిదిద్దే దిశగా పునఃసమీక్షలు జరుగుతున్నాయి.
రాజధాని ప్రణాళికను మొత్తం 65 వేల ఎకరాల స్థాయికి విస్తరించే ఆలోచన ప్రభుత్వం వద్ద ఉంది. గతంలో లాగే రైతుల అంగీకారంతో, ప్రయోజనాలను కాపాడుతూ భూములు సేకరించాలన్న దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. రైతులకు నష్టమిలేకుండా ధరలు నిర్ణయించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే మాస్టర్ ప్లాన్ అప్‌డేట్, నిర్మాణాల నిధుల సమీకరణ, గ్రీన్ సిటీ డిజైన్ వంటి అంశాలపై ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. ఈ నిర్ణయం అమరావతిని భారత అభివృద్ధికి ప్రాతినిధ్యంగా నిలబెట్టే దిశగా తీసుకున్న మెరుగైన అడుగుగా భావిస్తున్నారు విశ్లేషకులు.