ఏపీ: రాజధాని అమరావతిలో తొలిసారి ప్రైవేటు నిర్మాణం ప్రారంభం కాబోతోంది. నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో-అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది.
2015-17 మధ్య టీడీపీ ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణానికి భూమిని కేటాయించింది. అయితే వైసీపీ హయాంలో మూడు రాజధానుల చర్చ కారణంగా పనులు ఆగిపోయాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి అభివృద్ధికి మరోసారి గాలి తగిలింది. కేంద్రం, నాబార్డు నిధులతో పాటు రాష్ట్ర సొంత నిధులు కలిపి అమరావతి అభివృద్ధికి రూ.42,000 కోట్లు కేటాయించారు.
ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ కూడా తన ఆసుపత్రి ప్రాజెక్ట్ పునరుద్ధరణపై దృష్టి పెట్టారు. గత ఆదివారం ఆయన ఆసుపత్రి స్థలాన్ని సీఆర్డీఏ అధికారులతో కలిసి పరిశీలించారు.
తక్కువ ఖర్చుతో కేన్సర్ వైద్యం అందించడమే లక్ష్యంగా బసవతారకం హాస్పిటల్‌ను అమరావతిలో నిర్మించనున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు.
త్వరలోనే జంగిల్ క్లియరెన్స్ పూర్తయిన ప్రాంతంలో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధమని ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు.
ఈ నెల చివర్లో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఇదే అమరావతిలో తొలి ప్రైవేటు నిర్మాణ ప్రాజెక్ట్ కావడం విశేషం.