ఆంధ్రప్రదేశ్: రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను పునఃప్రారంభించే వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం పంపనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.
ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమంగా ఇది జరగనున్నందున, ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నేత జగన్‌కు ఆహ్వానం తప్పనిసరిగా పంపబడుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇంతకుముందు 2015లో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించబడ్డా జగన్ హాజరుకాలేదు.
ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత, అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని టిడిపి ప్రభుత్వం స్పష్టమైన దిశలో నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆగస్టు తొలి వారంలో పనుల పునఃప్రారంభం జరగనున్న వేళ, ప్రతీ రాజకీయ నాయకుడికి ఆహ్వానం అందించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
ఆహ్వాన ప్రక్రియ వ్యక్తిగతంగానా, అధికారికంగానా అనేది ప్రోటోకాల్ నిబంధనల ఆధారంగా జరుగుతుందని చెప్పారు. ఇది శాసనసభా నియమావళిని అనుసరించిన ప్రక్రియ అని తెలిపారు.
ఇక ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యత పెరుగుతుండటంతో, జగన్ హాజరవుతారా అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.