బీజింగ్: ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ అయిన అమెజాన్.కాం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటోందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. చైనా కంపెనీ ఫేక్ రివ్యూలతో ప్రొడక్టులను ప్రమోట్ చేస్తున్న ఆన్‌లైన్ స్టోర్‌లను మూసివేస్తున్నట్లు (యాప్ నుంచి తొలగిస్తున్నట్లు), అలాగే చైనాకు సంబంధించి 600 బ్రాండ్‌లను తీసేస్తున్నట్లు ప్రకటించి చైనాకు భారీ షాక్ ఇచ్చింది.
ఈ అనూహ్య నిర్ణయంతో చైనాకు దాదాపు 130 మిలియన్ల రెన్‌మింబి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. చైనా సంస్థలు ఫేక్ రివ్యూలతో పాటు ఇతరత్రా నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో వాటీని యాఫ్ నుండి తొలగించినట్లు తెలిపింది. ‘మేడ్ ఇన్ చైనా.. సోల్డ్ ఇన్ అమెజాన్’ పేరుతో ఏర్పాటైన మర్చంట్ కమ్యూనిటీ ఈ తతంగాన్ని ఇన్నాళ్ళు నడిపిస్తోంది. ఇదంతా వినియోగదారుల సమీక్ష ఉల్లంఘన కిందకు వస్తుందని అమెజాన్ తెలిపింది.
అయితే చైనా యాప్‌ల విషయంలో అమెజాన్ కఠినంగా వ్యవహరించడం ఇదే మొదటి సారి కాదు. ప్రోత్సాహక రివ్యూలను 2016 నుంచి అమెజాన్ సంస్థ బ్యాన్ చేసింది. అంతేకాదు అలాంటి ఉల్లంఘనలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఐనా చైనా మార్కెట్‌లో ఇలాంటి వ్యవహారాలు సర్వసాధారణమయ్యాయి.
అమెజాన్ మాత్రం ఇలాంటి చర్యల్ని ఎన్నటికీ ఉపేక్షించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం మే నుంచి రంగంలోకి దిగిన అమెజాన్ తమ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. దీనివల్ల వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడిందని ట్రేడ్ గ్రూప్ షెంజెన్ క్రాస్ బార్డర్ ఈ-కామర్స్ అసోషియేషన్ వెల్లడించింది.
ఇదిలా ఉండగా అమెజాన్ చర్యలు చైనా ఈ-కామర్స్ మార్కెట్‌పై ఎటువంటి ప్రభావం చూపకపోవచ్చని చైనా మీడియా హౌజ్ వరుస కథనాలను ప్రసారం చేస్తోంది. చైనా తొలగించిన ఆన్‌లైన్ స్టోర్‌లు, బ్రాండ్‌లు, ఈబే, అలీఎక్స్‌ప్రెస్ వైపు మళ్లుతున్నట్లు చెబుతోంది. ఇక అమెజాన్ సైతం ఈ వివాదంపై స్పందించింది. అమెజాన్ కేవలం చైనాను మాత్రమే టార్గెట్ చేయలేదని, మిగతా దేశాల్లోనూ ఈ తరహా చర్యలు చేపట్టినట్లు అమెజాన్ ఆసియా గ్లోబల్ సెల్లింగ్ వైస్ ప్రెసిడెంట్ సిండీ థాయ్ వెల్లడించారు.