న్యూఢిల్లీ: ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021 అక్టోబర్ 4వ తేదీ నుండి ప్రారంభం అవబోతోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలయ్యే తేదీని అమెజాన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ యొక్క తేదీలను ప్రకటించిన కొన్ని రోజులకే అమెజాన్ కూడా తేదీలను ప్రకటించింది.
ఈ అమెజాన్ ఫెస్టివల్ అక్టోబర్ 4వ తేదీ నుండి నెల రోజుల పాటు ఈ సేల్ నిర్వహించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ ఒక రోజు ముందే డీల్స్‌ను అందుకునే అవకాశం అందిస్తుంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్‌లో అమెజాన్ పోటీదారు ఫ్లిప్‌కార్ట్ కూడా పండుగ ఆఫర్లతో దూసుకు వస్తోంది.
కాగా ఫ్లిప్కార్ట్ అక్టోబర్ నెల 7వ తేదీ నుండి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ సమయంలో కస్టమర్లను ఆకర్షించడం కోసం అమెజాన్ వివిధ రకాల మొబైల్ ఫోన్లు, యాక్ససరీలు మరియు స్మార్ట్ వాచ్ లు, ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు సహా గృహోపకరణాలపై డిస్కౌంట్లను సూచించే ఒక మైక్రోసైట్ ను కూడా రూపొందించింది.