ఏపీ: వల్లభనేని వంశీ అరెస్టు పట్ల వైసీపీ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాలేదని, ఇది అక్రమ అరెస్టు అని ఆరోపించారు. గన్నవరం టీడీపీ కార్యాలయ దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ ఉందని, అయినా అరెస్ట్ చేయడం తప్పుడు చర్య అని అన్నారు.
వల్లభనేని వంశీ అరెస్టుపై డీజీపీ కార్యాలయానికి వెళ్ళిన సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ, వంశీపై తప్పుడు కేసు పెట్టి ఇరికించేందుకు ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
వంశీ టీడీపీ నుంచి వైసీపీలో చేరడం వల్ల చంద్రబాబు, లోకేశ్ కక్షతో ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. వంశీని కలవడానికి ఆయన భార్య వచ్చినప్పటికీ అనేక ఆంక్షలు పెట్టారని తెలిపారు.
తమ వినతిపత్రం ఇచ్చేందుకు డీజీపీని కలవాలని ప్రయత్నించినా, డీజీపీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారని వాపోయారు.
వినతిపత్రం తీసుకునే ఎవరూ లేరని, ఇది అన్యాయం అని అన్నారు. డీజీపీ శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత వహించాలన్నారు.