వాషింగ్టన్: అఫ్గనిస్తాన్‌ను స్వాధీన పరుచుకున్న తాలిబన్లకు అమెరికా భారీ షాకిచ్చింది. మేము ఎవరి మీదా ప్రతీకార చర్యలు తీసుకునే ఉద్దేశం లేదు, అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తామన్న తాలిబన్లకు జో బైడెన్ సర్కార్ బ్రేకులు వేసింది. తాలిబన్లకు ఆఫ్ఘన్ కు ఇచ్చే నిధులను దక్కకుండా స్తంభింప చేసింది. అమెరికా బ్యాంకుల్లోని అఫ్గన్‌కు సంబంధించిన నిధులను ఫ్రీజ్ చేస్తున్నట్టు ప్రకటన చేసింది.
కాబూల్ ను తాలిబన్ తమ చేతుల్లోకి తీసుకున్నాక వారి చేతికి నిధులు అందుబాటులోకి వెళ్ళకుండా అమెరికా గత్తి చర్యలను చేపట్టింది. యుఎస్ ట్రెజరీ ఫెడరల్ రిజర్వ్, ఇతర అమెరికా బ్యాంకుల్లోని ఆఫ్ఘాన్ నిధులపై ఆంక్షలు విధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. 9.5 బిలియన్ డాలర్ల మేర నిధులను నిలిపివేసింది.
తాలిబన్ల చేతిలోకి ఈ నిధులు వెళ్తే అవి దుర్వినియోగం అవుతాయన్న కారణంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. తమ బ్యాంకుల్లోని అఫ్గన్ ప్రభుత్వానికి చెందిన ఆస్తులను తాలిబాన్లకు వాడుకునే అవకాశం ఉండదని పరిపాలనా అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తాలిబాన్‌లపై ఒత్తిడి తెచ్చేందుకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇతర చర్యలను కూడా ఆలోచిస్తోందని చెప్పారు.
కాగా తాలిబన్లు ఆక్రమణ చేసిన తరువాత అఫ్గన్ యొక్క కరెన్సీ అఫ్గని రికార్డు నష్టాలను చవిచూస్తోంది. బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ డేటా ప్రకారం, మంగళవారం 4.6 శాతం పడిపోయి డాలర్‌కు 86.0625 స్థాయికి దిగజారింది. మరోవైపు అఫ‍్గన్‌లో తాలిబన్లకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన సెగలు చెలరేగుతున్నాయి. ఈ చర్యలతో ఆందోళన చేస్తున్న ప్రజలపై తాలిబన్ల కాల్పులకు దిగారు.
జలాలాబాద్‌లో అఫ్గన్ జెండా ఎగరేసిన వారిపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. 10 మందికి పైగా గాయబడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అఫ్గాన్‌లో చోటుచేసుకుంటున్న పరిస్థితులను ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. తమ పౌరులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు ఆయా దేశాలు ప్రయత్నిస్తున్నాయి.