జాతీయం: భారత ప్రభుత్వానికి అమెరికా కోర్టు సమన్లు!
సిఖ్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) దాఖలు చేసిన హత్య కుట్ర కేసు నేపథ్యంలో అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. పన్నూ తనను హత్య చేసేందుకు భారత ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపిస్తూ అమెరికా కోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసులో భారత ప్రభుత్వంతో పాటు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మాజీ రా చీఫ్ సమంత్ గోయల్, రా ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్త పేర్లు ఉన్నాయి. ఈ సమన్లకు సంబంధించి భారత ప్రభుత్వం 21 రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంది.
ఎవరీ పన్నూ?
గురుపత్వంత్ సింగ్ పన్నూ “సిఖ్ ఫర్ జస్టిస్” (SFJ) అనే వేర్పాటువాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడు. ఈ సంస్థను 2007లో స్థాపించగా, 2019లో భారత ప్రభుత్వం SFJను నిషేధించింది. 2020లో పన్నూను చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద ఉగ్రవాదిగా ప్రకటించింది. పన్నూ గతంలో పలు సందర్భాల్లో ఎయిర్ ఇండియా విమానాలపై దాడులు చేస్తామని బెదిరింపులు చేశాడు. పన్నూ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ “ఖలిస్తాన్” కోసం ప్రచారం చేస్తూ, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.
అమెరికాలో హత్య కుట్ర
పన్నూ దావా ప్రకారం, అమెరికా గడ్డపై తన హత్యకు కుట్ర జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కుట్రను అగ్రరాజ్యం భగ్నం చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. భారతీయుడు నిఖిల్ గుప్త, భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. చెక్ అధికారులు అమెరికా సూచనల మేరకే నిఖిల్ గుప్తాను అరెస్టు చేసి, అనంతరం అతడిని అమెరికాకు అప్పగించారు.
భారత ప్రభుత్వ స్పందన
ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం ఇప్పటికే తన పాత్ర ఏమీ లేదని స్పష్టంచేసింది. పన్నూ చేసిన ఆరోపణలపై దర్యాప్తు కూడా ప్రారంభించామని పేర్కొంది. అమెరికా కోర్టు సమన్లకు 21 రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో, ఈ కేసు ఏమేరకు మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సి ఉంది.