వాషింగ్టన్: అమెరికా లో ఒక యువతికి గుండె ఎడమ వైపున కాకుండా విచిత్రంగా కుడి వైపున ఉంది. ఆశ్చర్యం కలిగించేదైనప్పటికీ ఈ విషయం వాస్తవమే. తాజాగా తనకు నిర్వహించిన పరీక్షల్లో ఈ సంగతి తెలియడంతో సదరు యువతి షాకయ్యింది. ఆమె చేసుకున్న పరీక్షల్లో గుండె కుడి వైపున ఉందని స్పష్టంగా తెలుసింది.
యూఎస్ లోని చికాగో నగరానికి చెందిన ఒక 19 ఏళ్ల యువతి క్లారీ మక్ ఈ మధ్య విపరీతమైన దగ్గుతో బాధపడుతోంది. తనకు రెండు నెలల నుండి దగ్గు తగ్గకపోవడంతో పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లింది. తను జూన్ నెలలో ఆస్పత్రికి వెళ్లి మందులు వేయించుకున్నా కూడా దగ్గు ఏ మాత్రం తగ్గలేదు.
ఇలా తనకు ఎంతకీ దగ్గు తగ్గకపోవడంతో ఊపిరితిత్తుల సమస్య ఉండవచ్చని భావించిన వైద్యులు ఎక్స్ రే తీయించుకోవాలని తెలిపారు. ఎక్స్ రే చేసుకున్న అనంతరం రిపోర్ట్‌ను పరిశీలించిన వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. వైద్యులు తనకు గుండె కుడి వైపున ఉంది అని తెలుపడంతో గందరగోళానికి గురయ్యానని, తాను షాక్‌లో ఉన్నట్లు క్లెయిర్ మక్ తెలిపారు.
దీని వల్ల తనకు ఏమైనా ప్రమాదం జరుగుతుందా అని వైద్యులను అడుగగా దీని వల్ల ఎలాంటి సమస్య ఉండదని వైద్యులు చెప్పినట్లు తెలిపింది. గుండె కుడి వైపు ఉండడాన్ని వైద్య పరిభాషలో ‘డెక్స్‌ట్రోకార్డియా’ అని అంటారు. ఈ వివరాలన్నీ క్లెయిర్ మక్ టిక్‌టాక్‌లో ఓ వీడియో రూపొందించి విడుదల చేసింది. కాగా దేవుడి దయతో తాను బాగున్నానని ఆ వీడియోలో ఆ అమ్మాయి తెలిపింది.