అంతర్జాతీయం: ట్రంప్ సుంకాలతో కంగారుపడుతున్న అమెరికా ప్రజలు
ధరలు పెరిగే భయంతో షాపింగ్‌కు ఉప్పెన
అమెరికాలో విదేశీ దిగుమతులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన కొత్త సుంకాల ప్రభావం దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా వినియోగదారులు, రైతులు, వ్యాపార వర్గాలు అందరూ ఈ విధానాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎలక్ట్రానిక్స్‌కి భారీ డిమాండ్
తైవాన్ దిగుమతులపై 32 శాతం సుంకాలు విధించడంతో, అక్కడి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ వినియోగదారులు ముందుగానే ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, కెమెరాలు వంటి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు చెందిన గుటిరెజ్ అనే వ్యక్తి 2,400 డాలర్ల విలువైన ల్యాప్‌టాప్‌ను తక్షణమే కొనుగోలు చేయగా, కాలిఫోర్నియాకు చెందిన లీ వూక్నర్ అనే CEO తనకు కావాల్సిన ఆడి కారు తీసుకున్నాడు.
వ్యవసాయ రంగం కూడా బలయ్యేనా?
అమెరికా వ్యవసాయ రంగంపై కూడా ఈ నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా సోయాబీన్, జొన్న, బీఫ్, చికెన్‌లను దిగుమతి చేసుకునే చైనా.. ఇప్పుడు 34 శాతం సుంకాలు విధించడం వల్ల ఈ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. మిన్నెసోటా రైతు టిమ్ డఫాల్ట్ వాపోతూ.. ఈ ఏడాది తన ఆదాయం సగానికి తగ్గిపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు.
అమెరికా వ్యాపారానికి ఇతర దేశాల ఛాలెంజ్
చైనా అమెరికా ఉత్పత్తులపై మరింత సుంకాలు పెంచుతుంటే.. బ్రెజిల్ వంటి దేశాల నుండి దిగుమతులు పెరగనున్నాయి. ముఖ్యంగా బైజియు మద్యం తయారీలో అవసరమయ్యే జొన్నను ఇప్పటి వరకు అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న చైనా.. ఇప్పుడు దాని ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలపై దృష్టిసారించడం మొదలుపెట్టింది.
ట్రంప్ రైతులకు మద్దతివ్వబోతున్నారా?
గతంలో కూడా ట్రంప్ (Trump) సుంకాల నిర్ణయాల అనంతరం రైతులకు ఆర్థిక సాయం అందించారు. ఇప్పుడైతే వ్యవసాయ మంత్రి బ్రూక్ రాలిన్స్ (Brooke Rollins) ప్రస్తుతం పెద్దఎత్తున సాయం అవసరం లేదని వ్యాఖ్యానించారు. అయినా పరిస్థితి దారుణంగా మారితే ట్రంప్ రైతులకు మద్దతుగా నిలుస్తారని చెబుతున్నారు.
ఆశతో ఎదురు చూస్తున్న రైతులు
అన్ని దశలలోనూ వ్యవసాయ రంగంపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, రైతులు ప్రభుత్వ సాయంకంటే మార్కెట్ ద్వారా ఆదాయం పొందాలని ఆశిస్తున్నారు. చర్చల ద్వారా సుంకాలు తగ్గిపోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.