జాతీయం: 24 ఏళ్లలో అమెరికాలో అతిపెద్ద వైమానిక ప్రమాదం: 64 మంది మృతి సంభవించినట్లు అనుమానం
అమెరికాలో ఘోర వైమానిక ప్రమాదం చోటుచేసుకుంది. వాషింగ్టన్ సమీపంలో ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో విమానంలోని 64 మంది ప్రయాణికులు మరణించినట్లు అగ్నిమాపక శాఖ అధికారి వెల్లడించారు.
ఈ ఘటన బుధవారం రాత్రి అమెరికా కాలమానం ప్రకారం 8.30 గంటలకు జరిగింది. కాన్సాస్‌లోని విషిటా నుంచి బయల్దేరిన పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్ విమానం వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై ల్యాండింగ్ కోసం సిద్ధమవుతుండగా, రక్షణ శాఖకు చెందిన సికోర్‌స్కీ హెచ్-60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌ను ఢీ కొట్టింది.
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో విమానం నదిలో పడిపోయిందని అధికారులు తెలిపారు. సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు 28 మృతదేహాలను వెలికి తీసినట్లు వెల్లడించారు. విమానంలో ఉన్న 60 మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయే అవకాశముందని స్పష్టంచేశారు.
అయితే హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు మాత్రమే ఉన్నారని, వీఐపీలు ఎవరూ లేరని రక్షణ శాఖ వెల్లడించింది. హెలికాప్టర్ శకలాలను కూడా నది వద్ద గుర్తించినట్లు తెలిపారు. గాలింపు చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని, మరింత సమాచారం త్వరలో వెల్లడిస్తామని అగ్నిమాపక శాఖ చీఫ్ జాన్ డొన్నెలీ తెలిపారు.
ఈ ప్రమాదంలో అమెరికా ఫిగర్ స్కేటింగ్ టీమ్‌కు చెందిన 14 మంది సభ్యులు ఉన్నట్లు సమాచారం. వారి పరిస్థితి గురించి ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు.
గత 24 ఏళ్లలో అమెరికాలో జరిగిన అతిపెద్ద వైమానిక ప్రమాదమిదని అధికారులు పేర్కొన్నారు. విమానం పూర్తిగా నదిలో మునిగిపోయిందని, శకలాలను వెలికి తీసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు.
ఈ ప్రమాదంపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు తెలుసుకునేందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి.