న్యూఢిల్లీ: కశ్మీర్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఉగ్రదాడులు, బంద్‌లు, భయం. కానీ ఇప్పుడు అక్కడ సినిమా హాళ్లు నిండుతున్నాయి, యువత ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. ఈ మార్పుని కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యసభలో వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదాన్ని సహించదని, ఎటువంటి రాజీకి వెనక్కి తగ్గదని ఆయన స్పష్టం చేశారు.
గత ప్రభుత్వాల హయాంలో ఉగ్రవాదం పెరిగిందని విమర్శించిన అమిత్ షా, NDA పాలనలో కశ్మీర్‌లో ఉగ్రదాడులు 70% తగ్గాయని తెలిపారు. దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం వల్ల 92 వేలమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి గుర్తు చేశారు.
యురి, పుల్వామా ఘటనల తర్వాత తీసుకున్న శక్తివంతమైన చర్యలు – సర్జికల్, ఎయిర్ స్ట్రైక్‌లు దేశ భద్రతకు మద్దతుగా నిలిచాయని చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దుతో ‘ఒకే రాజ్యాంగం – ఒకే జెండా’ ఆశయాన్ని నెరవేర్చామన్న అమిత్ షా, 2019 నుంచి 2024 వరకు 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు యువతకు కల్పించామని తెలిపారు. ఈశాన్య భారతంలో పరిస్థితులు మెరుగైపోతున్నాయని, 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.