ఢిల్లీ: దేశ భద్రతకే ముప్పుగా మారే విదేశీయుల చొరబాటును మోదీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు – 2025’కి లోక్‌సభ ఆమోదం లభించడంతో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్ ధర్మశాల కాదని, ఇక్కడికి దురాలోచనతో వచ్చే వారిని అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు. విద్య, వ్యాపారం, వైద్యం, పర్యాటక అవసరాల కోసం వచ్చే విదేశీయులకు భారత్ స్వాగతం పలికే దేశమని, కానీ అక్రమంగా రానేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
ఈ బిల్లుతో ప్రతి విదేశీయుడిపై పూర్తి సమాచారం సేకరించడం సాధ్యమవుతుందని చెప్పారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల అక్రమ చొరబాటును లెక్కలతో వివరించారు.
వెస్ట బెంగాల్‌లో మమతా ప్రభుత్వం చొరబాటుదారులకు ఆధార్ కార్డులు, సదుపాయాలు కల్పిస్తూ దేశ భద్రతను కోల్పోతుందని ఆరోపించారు. సరిహద్దుల్లో 450 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం అడగడానికి భూమిని కూడా మంజూరు చేయలేదని విమర్శించారు.
ఈ బిల్లు దేశ భద్రతను బలోపేతం చేయడంతో పాటు, 2047 నాటికి భారత్ అత్యుత్తమ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడంలో కీలకంగా నిలుస్తుందని అమిత్ షా అభిప్రాయపడ్డారు.