మూవీడెస్క్: ఆనంద్ దేవరకొండ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.
‘దొరసాని’తో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, తొలి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ, ఆ తరువాత విభిన్న కథలను ఎంచుకోవడం ప్రారంభించారు.
‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాతో మంచి గుర్తింపు పొందారు, అయితే ‘పుష్పక విమానం’, ‘హైవే’ లాంటి సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
2022లో విడుదలైన ‘బేబీ’ సినిమా, ఆనంద్ దేవరకొండకు కెరీర్‌లోనే బిగ్ హిట్‌ని అందించింది.
ఈ సినిమా ద్వారా తన నటనకు విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా, సంతోషం అవార్డు, ఫిల్మ్ ఫేర్ నామినేషన్ కూడా దక్కించుకున్నారు.
ఈ విజయంతో తన మార్కెట్ స్థాయి పెంచుకుంటూ, వరుస ప్రాజెక్ట్స్ కోసం సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ చేతిలో నాలుగు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.
వైష్ణవి చైతన్యతో ‘డ్యూయెట్’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ దర్శకుడు వినోద్ ఆనంతోజుతో మరో సినిమా, అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో, SKN, సాయి రాజేష్ బ్యానర్‌లో మరో సినిమాలకు కమిట్ అయ్యారు.
ప్రతీ కథను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ, రియాలిటీకి దగ్గరగా ఉండే కథలను మాత్రమే తీసుకుంటున్నారనే మాట టాలీవుడ్‌లో వినిపిస్తోంది.