ఢిల్లీ : ప్రధాన మంత్రి కిసాన్ జాతీయ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కు లభించింది. అనంత కలెక్టర్ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతుల మీదుగా బుధవారం అవార్డును అందుకున్నారు. అనంతపురం జిల్లా ఇప్పటికే ప్రధాన మంత్రి కిసాన్ జాతీయ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం ఏటా రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మూడు విడతల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు రూ. 6వేల చొప్పున నగదును నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేస్తోంది. ఈ పథకం అమలులో అనంతపురం జిల్లా దేశంలోనే ముందు వరుసలో నిలిచింది.
కేంద్ర వ్యవసాయశాఖ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో 5శాతం మంది లబ్దిదారులకు సంబంధించి భౌతిక ధృవీకరణ కూడా పూర్తి చేశారు. అసలు వీరు పథకానికి అర్హులేనా? సరైన వివరాలే నమోదు చేశారా? అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
2018 డిసెంబర్ 1న ప్రారంభించిన ఈ పథకం కింద జిల్లాలో మొత్తం 63 మండలాల్లో 28,505 మంది లబ్ధిదారులు ఉన్నారు. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మరే జిల్లాలో లేని విధంగా లబ్ధిదారుల భౌతిక ధృవీకరణను 99.6 శాతం పూర్తి చేసింది. ఈ ఘనత సాధించడం పట్ల కేంద్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాను ప్రధాన మంత్రి కిసాన్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది.