అమరావతి: ఏపీలో అరాచక పాలన: సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శ
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళగిరి పోలీసులు తమకు పంపిన నోటీసులపై ఆయన స్పందించారు.
బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకుంటోందని సజ్జల తీవ్రంగా విమర్శించారు.
‘‘మాకు న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉంది. కానీ, అక్టోబర్ 7న నేను విదేశాలకు వెళ్ళిన తరువాత అక్టోబర్ 10న నోటీసులు పంపడం ఏం తాత్పర్యమో?.
2021లో టీడీపీ ఆఫీస్‌పై జరిగిన దాడి కేసు విషయంలో ఇప్పుడు మళ్లీ కొత్తగా నోటీసులు పంపిస్తున్నారు. ఏపీలో అసలు ప్రజాపాలన ఉందా?
చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. అరాచకానికి హద్దు లేకుండా వ్యవహరిస్తున్నారు,’’ అని సజ్జల మండిపడ్డారు.
చంద్రబాబుకు క్లీన్‌చిట్ ఎలా ఇస్తారు?
సజ్జల మాట్లాడుతూ, ‘‘స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ అటాచ్‌మెంట్ చేస్తే, చంద్రబాబు తప్పుడు పని చేసినట్టు నిర్ధారణ అయినట్టే కదా!
ఆస్తుల అటాచ్‌మెంట్ జరిగితే, చంద్రబాబుకు క్లీన్ చిట్ ఎలా ఇస్తారు?. ఇది పరిపాలనా విధానానికి తగినదా?
తప్పుడు కేసులు పెట్టి జనాన్ని తప్పుదారి పట్టించొచ్చు కానీ కోర్టులను కాదు,’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తప్పుడు కేసులు.. లక్ష్యం ఏంటి?
‘‘ఏదోలా కేసులలో ఇరికించి, ప్రభుత్వాన్ని విమర్శించే వారందరినీ టార్గెట్ చేస్తున్నారు. పట్టాభి ఉద్దేశపూర్వకంగా సీఎం జగన్‌ని దూషించారు.
అప్పుడు టీడీపీ ఆఫీస్‌పై గొడవ జరిగింది. కానీ, ఈ అంశంపై ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టడం సరికాదు.
చంద్రబాబు పాలనలో ప్రజలకు, పోలీసు వ్యవస్థకు న్యాయమే లేదన్న విషయాన్ని ఇప్పుడు మరింత స్పష్టంగా చూస్తున్నాం,’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
న్యాయ పోరాటం చేస్తాం
‘‘ఎప్పటికప్పుడు తప్పుడు కేసులు పెట్టి, వైఎస్సార్‌సీపీ నేతలను భయపెట్టాలన్న చంద్రబాబు కుట్రలు విజయవంతం కావు. మేము కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తాం.
న్యాయం చివరకు గెలుస్తుందనే విశ్వాసం మాకుంది. ఈ రాష్ట్రంలో ఇంకా ప్రజా పాలన కొనసాగుతోందా? అనేది ప్రశ్నించాల్సిన పరిస్థితి,’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.