న్యూఢిల్లీ: భారత కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కాలుష్య రాష్ట్రాల, ప్రాంతాల జాబితా విడుదల చేసింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్య ప్రాంతాలు లేవని తన జాబితాలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తాజా నివేదికలో పేర్కొంది. అలాగే దేశం మొత్తం మీద అత్యధికంగా 23 కాలుష్య ప్రాంతాలతో ఒడిశా రాష్ట్రం తొలి స్థానంలో ఉంది.
తరువాత స్థానాలలో ఉత్తరప్రదేశ్ (21), ఢిల్లీ (11) రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. కాగా, తెలంగాణలో రెండు, నూర్ మహ్మద్ కుంట లేక్ (కాటేదాన్), పటాన్‌చెరు (మెదక్) అధిక కాలుష్య ప్రాంతాలని ఈ నివేదిక ప్రకారం తెలుస్తోంది. దేశంలో పలు ప్రాంతాల్లో ప్రమాదకరమైన, ఇతర వ్యర్థాల వల్ల అనేక కలుషితమైన డంపింగ్ ప్రదేశాలు ఏర్పడ్డాయని తెలిపింది.
ఈ కాలుష్యాల వల్ల భూగర్భ మరియు ఉపరితల జలాలు తీవ్ర కలుషితమై ప్రజారోగ్య, పర్యావరణ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని పేర్కొంది. అశాస్త్రీయ పద్ధతిలో లేదా నిర్దేశిత నిబంధనలు ఉల్లంఘించి పారిశ్రామిక వ్యర్థాలను పారవేయడం వల్ల కలుషిత ప్రాంతాలు రూపొందుతున్నాయని తెలిపింది.
కాగా ఈ ప్రమాదకర వ్యర్థాల నిర్వహణపై సరైన నియంత్రణ లేనందువలన కాలుష్య ప్రాంతాలుగా మారుతున్నాయని వివరించింది. కాలుష్య నివారణ ఖర్చు సామర్థ్యానికి మించి ఉండడంతో చాలా ప్రాంతాలు పర్యావరణానికి ముప్పుగా పరిణమించాయని వెల్లడించింది.