ఆంధ్రప్రదేశ్: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్‌లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. మొత్తం రూ.2.94 లక్షల కోట్ల బడ్జెట్‌లో, గృహనిర్మాణానికి రూ.4012 కోట్లు కేటాయించారు.
ఈ కేటాయింపులు ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇళ్ల నిర్మాణానికి దోహదం చేస్తాయని పయ్యావుల పేర్కొన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ఎన్టీఆర్ నగరాలు పథకం కింద 2029 నాటికి పేదలందరికీ ఇళ్లు కల్పించడం ముఖ్య లక్ష్యమని చెప్పారు. ఈ పథకం కింద 25 లక్షల ఇళ్ల పట్టాలు, ఇళ్లు అందజేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఇందుకు గాను విస్తృతంగా నిధులు కేటాయించామని పయ్యావుల వివరించారు.
ఈ పథకం అమలు ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, వారికీ స్థిరమైన నివాసం కల్పించటం ద్వారా సంక్షేమం ముందుకు సాగుతుందని చెప్పారు.
గ్రామీణాభివృద్ధి కోసం రూ.16739 కోట్లు, పురపాలక అభివృద్ధి కోసం రూ.11,490 కోట్లు కేటాయించడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదల అవసరాలు తీర్చడానికి సర్కారు కట్టుబడి ఉందని పయ్యావుల వివరించారు.