ఆంధ్రప్రదేశ్: ఏపీని 2047 నాటికి పూర్తి స్థాయి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా మలచడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులను పెంచేందుకు, ప్రముఖ సంస్థలను ఆకర్షించేందుకు ఆయన విశేష కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విజన్ 2047 సూత్రాలను వివరించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన వర్క్‌షాప్‌లో చంద్రబాబు పాల్గొని, బడ్జెట్ సమావేశాలపై, తాజా బిల్లులు, పాలసీలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ప్రజా సమస్యలపై చర్చించేందుకు, చట్టసభల్లో సమర్థవంతంగా పాల్గొనేందుకు జవాబుదారీగా ఉండాలని చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. సభలో ప్రతిపక్షం లేకున్నా, ప్రజల ప్రయోజనాల కోసం చర్చలు జరగాలన్నారు.
తాజా రాజకీయ పరిణామాలు, బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చంద్రబాబు చర్చలు జరిపారు.
ముఖ్యంగా చీఫ్ విప్, విప్ ల నియామకాలపై ఏ పార్టీ నుంచి ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారు అన్న విషయంపై కూడా దృష్టి సారించారు. వికసిత ఆంధ్రా లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులతో కలిసి కృషి చేయాలని ఆయన కోరారు.