అమరావతి: ఏపీలో నేటి నుండి ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ యాజమాన్యాల ఆధీనంలోని అన్ని స్కూళ్ళు ఇవాళ నుండి తెరుచుకోనున్నాయి. కోవిడ్ విస్తృతి ఇంకా పూర్తిగా ముగియని నేపథ్యంలో విద్యార్థులు, సిబ్బంది వైరస్ బారిన పడకుండా ఉండేలా విద్యా శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది.
ప్రతి పాఠశాల వారీగా కోవిడ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమలుకు మార్గదర్శకాలను జారీ చేసింది. పాఠశాలలోని ప్రతి తరగతి గదిలో కేవలం 20 మంది విద్యార్థులనే అనుమతించాలని అంతకు మించి పిల్లలను అనుమతించకూడదన్నారు. అలాగే పాఠశాలలకు వచ్చే విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుండి లిఖితపూర్వక అనుమతితోనే తరగతులకు హాజరు కావాలి.
విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది అందరూ తప్పకుండా మాస్కులు ధరించాలి. ఇప్పటికే పాఠశాల లోపల మరియు బయట పరిసరాల్లోనూ పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయించారు. పాఠశాలలకు ఇంతకుముందు నిర్దేశించిన సమయాల ప్రకారమే పని చేస్తాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతిరోజూ స్కూళ్లకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశించింది. పిల్లల సంఖ్యకు తగినమేర వసతి లేని పక్షంలో తరగతులను రోజు విడిచి రోజు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.
తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీటింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో వైపు మధ్యాహ్న భోజనం తీసుకునే సమయంలో విద్యార్థులందరికీ ఒకేసారి కాకుండా తరగతుల వారీగా వేరువేరు సమయాల్లో అందిస్తారు. అలాగే స్కూలు వదిలిన తరువాత కూడా అందరినీ ఒకేసారి కాకుండా 10 నిమిషాల వ్యవధి ఇచ్చి తరగతుల వారీగా బయటకు పంపిస్తారు. స్కూల్లలో అసెంబ్లీ, బృంద చర్చలు, గేమ్స్, స్పోర్ట్సు వంటివి వాటిని కూడా పూర్తిగా రద్దు చేశారు.