అమరావతి: ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీకి ఎంతో ముఖ్యమైన ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్ 2022) ఈ సంవత్సరం ఆగస్టులో నిర్వహించడానికి ఏపీ పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
పేపర్లవారీగా పరీక్షల తేదీలు, ఇతర సమాచారంతో త్వరలోనే విద్యా శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. కాగా రాష్ట్రంలో టెట్ రాయడానికి అభ్యర్ధులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. టెట్ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్‌ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి రాసేందుకు ఇప్పుడు సిద్ధమవుతున్నారు.
కాగా టెట్ పరీక్షలో వచ్చే మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉండటంతో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్‌సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది.