హైదరాబాద్: 2019 లో మలయాళం లో వచ్చిన ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5 .25 ‘ అనే సినిమాని తెలుగులో ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’ పేరుతో విడుదల చేసారు. ఒక ఊర్లో ఉండే భార్య ని కోల్పోయిన వృద్ధ తండ్రి, కొడుకుని ఊరు దాటి బయటకి పంపించకుండా అక్కడే ఏదైనా పని చూసుకొమ్మని పట్టు పట్టుకు కూర్చుంటాడు. ఆ తండ్రికి ఉండే చాదస్తం వలన ఎంత మంది హౌస్ నర్స్ లని పెట్టినా కూడా ప్రయోజనం ఉండక పోవడం తో ఆ వృద్ధ తండ్రికి ఒక రోబోట్ ని అప్పగించి ఆ కొడుకు తన వృత్తి రీత్యా వేరే దేశానికి వెళ్తాడు. అంత చాదస్తం, కమ్మూనిస్టు భావాలు, అగ్ర కులం అనే ఫీలింగ్స్ ఉండే వృద్ధ తండ్రి ఆ రోబో ని ఎలా అంగీకరించాడు, ఆ రోబో కట్టప్ప గా ఎలా మారింది ఆ రోబో ని వూర్లో వాళ్ళు ఎలా చూసేవారు, రోబో కి వృద్ధ తండ్రి కి మధ్య బంధం ఎలా ఏర్పడింది చివరికి ఆ రోబో కథ ఎలా ముగించారు అనేది ప్రధాన కథ.
టెక్నిషియన్స్ విషయానికి వస్తే దర్శకుడు మానవ సంబంధాల ఆధారంగా రాసుకున్న కథని చాలా బావోద్వేగంగా చెప్పగలిగాడు. తాను అనుకున్న ఎమోషన్ సరిగ్గా చెప్పగలిగాడు అనేది స్పష్టం అవుతుంది. ఇంగ్లీష్ యానిమేషన్ సినిమాలు చూసే వారికి ‘వాల్ -ఈ’ (WALL – E ) సినిమా సుపరిచితం. ఆ సినిమాలో రెండు రోబో ల మధ్య జరిగే ఎమోషనల్ అటాచ్మెంట్ చాలా అద్భుతం గా ఉంటుంది. ఈ సినిమాలో ఒక రోబో కి ఒక మనిషికి మధ్య ఉండే అటాచ్మెంట్ అంతలా చూపించాడు. అలాగే రోబో కి బట్టలు వేయడం, జాతకం చూపించడం లాంటి సన్నివేశాలతో కామెడీ కూడా హ్యూమరస్ గా చూపించాడు. మలయాళం మేకింగ్ లో ఉన్న బెస్ట్ ఏంటి అంటే నేటివిటీ. వాళ్ళు ప్రతి ఫ్రేమ్ లో తమ నేటివిటీ ని, ప్రకృతి ని ఎక్కడ మిస్ చెయ్యరు. ఈ సినిమా లో కూడా సినిమాటోగ్రాఫర్ తన పనితనం తో ఆకట్టుకున్నాడు. సంగీతం కూడా ఆకట్టుకుంది.
నటీనటుల విషయానికి వస్తే తండ్రి పాత్రలో నటించిన ‘సూరజ్ వెంజరామూడు’ అద్భుతం గా చేసాడు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో తన పాత్ర చూస్తేనే సినిమా చూసేవాళ్ళకి చిరాకు అనిపిస్తుంది అంటే అర్ధం చేసుకోవచ్చు ఆ పాత్రని తాను ఎంత బాగా చేసాడో అని. సౌబిన్ కూడా తన తండ్రి గురించి బాధపడే ఒక కొడుకు పాత్రలో బాగానే నటించాడు. మిగతా వాళ్ళందరూ తమ తమ పాత్రల మేరకి ఆకట్టుకున్నారు.
చివరగా చెప్పాలంటే మానవ సంబంధాలు గురించి చెప్పే ఒక అద్భుతమైన సినిమా ఇది అని చెప్పుకోవచ్చు. అలాగే ఎంత ఆధునికమైన జీవితం వైపు వెళ్తున్నా కూడా రోబో లతో బంధానికి మనుషులతో బంధానికి ఉన్న తారతమ్యాన్ని చాల చక్కగా చెప్పారు అని చెప్పుకోవచ్చు.