ఆంధ్రప్రదేశ్: విజయశాంతి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన చిన్నారి ఆరోగ్యంగా ఉండటంతో పవన్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
తలనీలాలు సమర్పించి, స్వామివారి పాదాలపై కృతజ్ఞతలు తెలిపిన లెజినోవా, రూ.17 లక్షలు తిరుమల నిత్య అన్నదానానికి విరాళంగా అందించారు. భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని వడ్డించి, స్వయంగా భోజనం చేశారు. ఈ సందర్భంలో తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఈ క్రమంలో ఆమె తలనీలాలు సమర్పించడాన్ని కొందరు ట్రోల్ చేస్తున్నారు. సనాతన సంప్రదాయాల్లో మహిళలు ఇలా చేయరని అభిప్రాయపడ్డారు. దీంతో, ట్రోలింగ్‌కు తీవ్రంగా స్పందించిన విజయశాంతి, లెజినోవా నమ్మికను గౌరవించాలని స్పష్టం చేశారు.
“వారు ఇతర దేశానికి చెందినవారు అయినప్పటికీ హిందూ ధర్మాన్ని గౌరవించి శ్రద్ధతో తలనీలాలు సమర్పించారు. ట్రోల్ చేయడం సమంజసం కాదు” అంటూ విజయశాంతి పేర్కొన్నారు. ఆమె స్పందన నెటిజన్స్‌లో చర్చనీయాంశమైంది.