అమరావతి: ముంబాయి బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరోసారి పూర్తిగా చిక్కుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు అధికారులపై కేసులు నమోదు కాగా, రాష్ట్ర ప్రభుత్వం కొందరిని సస్పెండ్ చేసింది. తాజాగా, కాదంబరీని తప్పుడు కేసుల్లో ఇరికించి, ఆమె స్నేహితుడిపై కూడా తప్పుడు కేసులు పెట్టడం పట్ల పోలీసుల మీద తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తప్పుడు కేసుల వివరాలు
ఫిబ్రవరి 10న విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్‌పై దాడి చేసిన పోలీసులు, ఆ కేసులో దక్షిణ భారతదేశానికి చెందిన ఓ మహిళను ఏ1 నిందితురాలిగా, కాదంబరీ స్నేహితుడు అమిత్ కుమార్ సింగ్‌ను ఏ2గా చేర్చారు. అతను ఈశాన్య రాష్ట్రాల నుండి విజయవాడకు మహిళలను సరఫరా చేసి, వ్యభిచారం నిర్వహిస్తున్నాడనే ఆరోపణలు చేసి తప్పుడు కేసు నమోదు చేశారు. అయితే, దాడి జరిగిన తేదీ కంటే ముందే పోలీసు అధికారులు ఢిల్లీకి విమాన టికెట్లు బుక్ చేయడం, అతి ఆతృతగా చర్యలు చేపట్టడం వీరిపై ఆరోపణలకు ఆధారమైంది.
ముందుగా బుక్ చేసిన టికెట్లు
ముంబాయి నటి జెత్వానీని అరెస్ట్ చేయడానికి ముందే, ఫిబ్రవరి 9న పోలీసులు ఢిల్లీకి టికెట్లు బుక్ చేయడం, ఆమె బాయ్ ఫ్రెండ్ అమిత్ కుమార్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేకంగా ప్రయత్నాలు చేసినా, అతను చిక్కకపోవడం వంటి అంశాలు పోలీసుల తీరుపై మరింత అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
ఐఫోన్ ఎపిసోడ్
అరెస్టు సమయంలో, కాదంబరీ జెత్వానీ ఐఫోన్‌ను ఓపెన్ చేయడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేసినా విఫలమయ్యారు. ఆమె ఐఫోన్‌ని ఓపెన్ చేయడానికి ఆమె బాయ్‌ఫ్రెండ్ అమిత్‌కుమార్ సింగ్‌ను వాడుకోవచ్చని వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ పోలీసులకు సలహా ఇచ్చినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
దర్యాప్తులో కొత్త కోణాలు
కాదంబరీ జెత్వానీ కేసులో, ఆమెపై పెట్టిన ఆరోపణలు, ఈ విచారణలో అధికారుల అనేక తప్పిదాలు బయటపడటంతో, మరికొంతమంది పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పీఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతి రాణా తాతా, విశాల్ గున్ని వంటి ఐపియెస్ అధికారులతో సహా పలువురు పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు.