ఏపీకి మరో భారీ పెట్టుబడి రిలయన్స్ క్లీన్ ఎనర్జీ రూపంలో రానుంది.
అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం తీసుకొంటున్న కీలక నిర్ణయాలు ఫలితాలను ఇవ్వబోతున్నాయి. దీని వెనుక మంత్రి నారా లోకేశ్ కృషిని మెచ్చుకోకుండా ఉండలేం. ఈ క్రమంలో, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థతో ఆంధ్రప్రదేశ్‌కి పెద్ద మైలురాయిగా నిలిచే పెట్టుబడి ఒప్పందం కుదిరింది. రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో కృషి చేస్తున్న లోకేశ్, ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్‌గా వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.
అమెరికా పర్యటనకు ముందు ముంబైలో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ, క్లీన్ ఎనర్జీ విభాగానికి నేతృత్వం వహిస్తున్న అనంత్ అంబానీతో లోకేశ్ చర్చలు జరిపారు. ఈ చర్చలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏపీలో రూ. 65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు అంగీకరించింది. గుజరాత్ తర్వాత ఏపీలోనే ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడడం అభివృద్ధి దిశగా మరొక మైలురాయిగా నిలవనుంది. రాష్ట్రంలో 500 అధునాతన బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా అనేక ఉపాధి అవకాశాలు సృష్టించనున్నారు.
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అమరావతిలో ఏపీ పరిశ్రమల శాఖ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అంతేగాక, టాటా పవర్ కూడా లోకేశ్ కృషితో రాష్ట్రంలో సౌర మరియు పవన విద్యుత్ రంగాల్లో రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది.
వివిధ రంగాల్లో పెట్టుబడుల కోసం లోకేశ్ కృషి, దేశవ్యాప్తంగా పరిశ్రమ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నదని చెప్పవచ్చు. స్టీల్ దిగ్గజం ఆదిత్య మిట్టల్‌తో జరిగిన ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూ. 1.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఖరారు చేయడం, మరియు తాజాగా రిలయన్స్‌తో కూడిన పెట్టుబడులపై ఏపీ నిరుద్యోగుల్లో, పారిశ్రామిక వర్గాల్లో ఉత్సాహం వ్యక్తం అవుతోంది. రిలయన్స్ పెట్టుబడులు వల్ల రాష్ట్రంలో 2,50,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అనేక ప్రోత్సాహక చర్యలు తీసుకోవడంతో, మంత్రి లోకేశ్ రాష్ట్ర యువతకు కొత్త అవకాశాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ముంబై చర్చల అనంతరం కేవలం 30 రోజుల వ్యవధిలోనే పెట్టుబడులు కార్యరూపం దాల్చడం, ఏపీ ప్రభుత్వ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్’ విధానానికి ఫలితంగా నిలిచింది.