అమరావతి: ఏపీకి మరో భారీ పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు మరింత పెరిగే దిశగా మరో అంతర్జాతీయ సంస్థ ముందుకు వస్తోంది.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్‌జీ, ఏపీలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన తరువాత, పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుండటం గమనార్హం.
ఇప్పటికే పలు మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్స్ (ఎంవోయూలు) కుదరగా, తాజాగా ఎల్‌జీ కూడా ఇదే దిశగా అడుగులు వేస్తోంది.
ఇందులో భాగంగా, ఎల్‌జీ రూ.7000 కోట్లతో ఏపీలో మూడో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
300 ఎకరాల విస్తీర్ణంలో మేగా ఫ్యాక్టరీతో పాటు శ్రీసిటీలో రూ.2000 కోట్లతో వెండార్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ తాము రూ.5000 కోట్లు, విడిభాగాల సరఫరాదారులు మరో రూ.2000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం.
ఈ ప్లాంట్ ద్వారా 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కొత్తగా నిర్మించే ఈ ఫ్యాక్టరీలో ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టీవీలను ఉత్పత్తి చేయాలని ఎల్‌జీ యాజమాన్యం నిర్ణయించింది.
1997లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఎల్‌జీకి ఉత్తరప్రదేశ్‌లో గ్రేటర్ నోయిడా, మహారాష్ట్రలో పుణె సమీపంలో రంజన్‌గావ్‌లలో రెండు ప్లాంట్లు ఉన్నాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మూడో ప్లాంట్ కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.
శ్రీసిటీలో ఇప్పటికే డైకిన్, హవెల్స్, బ్లూస్టార్ వంటి ప్రధాన సంస్థల ప్లాంట్లు ఉన్నాయి.
ఇప్పుడు ఎల్‌జీ కూడా ఈ పరిశ్రమలతో కలిసి శ్రీసిటీని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చే దిశగా అడుగులు వేస్తోంది.
అమెరికా తర్వాత ఎల్‌జీకి అతిపెద్ద మార్కెట్ మన దేశం కావడం వల్లే సంస్థ దక్షిణ భారతదేశంలో ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది.
దీనిలో భాగంగా, ఏపీలో భారీ పెట్టుబడుల ప్రణాళికలు చేపట్టినట్లు తెలుస్తోంది.