తెలంగాణలో మరో కొత్త పర్యాటక హబ్ – లక్నవరం సరస్సులో మూడో ద్వీపం
హైదరాబాద్: అండమాన్, మాల్దీవులు వంటి ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలను తలపించే విధంగా తెలంగాణలో మరో ఆకర్షణీయమైన ద్వీపం అందుబాటులోకి వచ్చింది. ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సులో ఇప్పటికే ఉన్న రెండు ఐలాండ్లకు అదనంగా, మూడో ద్వీపాన్ని తెలంగాణ పర్యాటక శాఖ ప్రారంభించింది. పర్యాటక అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యల్లో ఇది కీలక అడుగుగా నిలుస్తుంది.
లక్నవరం సరస్సు: ఒక స్వర్గధామం
210 కి.మీ దూరంలో ఉన్న హైదరాబాద్ నగరానికి, 70 కి.మీ దూరంలో ఉన్న వరంగల్‌కు సమీపంలో గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ వద్ద ఈ సరస్సు దట్టమైన అడవుల మధ్య కొండల నడుమ ఉంటుంది. ఈ ప్రాంతం పర్యాటకులను ఇప్పటికే ఆకర్షిస్తుండగా, తాజా ద్వీపం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
మూడో ద్వీపం విశేషాలు
లక్నవరం సరస్సులో సుమారు రూ.7 కోట్ల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో ఈ ద్వీపాన్ని అభివృద్ధి చేశారు. 21 కాటేజీలు, నాలుగు వ్యక్తిగత స్విమ్మింగ్ ఫూల్స్, పిల్లల కోసం ప్రత్యేకమైన ఆటవస్తువులు, స్విమ్మింగ్ ఫూల్‌లు, పెద్దల కోసం రెండు స్పాలు, రెస్టారెంట్లు ఈ ద్వీపంలో ప్రధాన ఆకర్షణలు. కుటుంబసభ్యులతో విశ్రాంతి కోసం కాటేజీలను ప్రత్యేకంగా రూపొందించారు.
ఆధునిక సౌకర్యాలతో కొత్త దీవి
ఈ ద్వీపం పర్యాటకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సౌకర్యాలతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసారు. ఫ్రీ కోట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ సుమారు 40 మంది సిబ్బంది సేవలను అందిస్తున్నారు. పర్యాటకులు ఇక్కడ ఒక కొత్త అనుభూతిని పొందేలా అన్నివిధాలా సౌకర్యాలు కల్పించారు.
పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చొరవ
తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే సీతక్క ఈ ద్వీపాన్ని ప్రారంభించారు. లక్నవరం సరస్సు, రామప్ప వంటి పర్యాటక ప్రాంతాలు రాష్ట్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం రూ.150 కోట్ల వ్యయం చేస్తోందని, ప్రజలు తరచూ ఇటువంటి ప్రాంతాలను సందర్శించి మానసిక ఉల్లాసాన్ని పొందాలని సూచించారు.
లక్నవరం: ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్
సమ్మక్క-సారలమ్మ జాతర, రామప్ప ఆలయం వంటి ప్రఖ్యాత ప్రాంతాలకు సమీపంగా ఉండటంతో, లక్నవరం సరస్సు పర్యాటకులకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ద్వీపం తెలంగాణ పర్యాటక రంగాన్ని మరింత ఉన్నతంగా నిలబెడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.