అనుష్క శెట్టి కెరీర్‌లో మరో ప్రత్యేకమైన సినిమా ‘ఘాటి’. ‘వేదం’ తర్వాత మళ్లీ అనుష్క-క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. సూపర్ స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తనదైన మార్క్ చూపించిన అనుష్క, బాహుబలి తర్వాత కేవలం కంటెంట్ బేస్డ్ సినిమాలను ఎంచుకుంటూ తనదైన మార్గంలో ముందుకెళ్తోంది.
చివరగా వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మంచి హిట్ అయినా, ఆ తర్వాత ఆమె సినిమాలపై అంతగా అప్‌డేట్స్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇదిలా ఉండగా, ‘ఘాటి’ సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించినా, ఇప్పటి వరకు ప్రమోషన్లు ప్రారంభించకపోవడం కలకలం రేపుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఒకటి రెండు పోస్టర్లు మినహా, సినిమా గురించి పెద్దగా ప్రచారం లేకపోవడంతో వాయిదా పడే అవకాశముందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
విక్రమ్ ప్రభు ఇందులో కీలక పాత్ర పోషిస్తుండగా, క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆయనకు కూడా కీలకం కానుంది. క్రిష్ సినిమాలు సాధారణంగా విజువల్‌గా రిచ్‌గా, పవర్‌ఫుల్ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్స్‌తో రూపొందుతాయి.
అదే ఫార్మాట్‌లో ‘ఘాటి’ కూడా ఉంటుందని భావిస్తున్నారు. అయితే సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నా ప్రమోషన్లు మౌనంగా ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సినిమా వాయిదా పడే సూచనలా లేక మేకర్స్ ఒక్కసారిగా ప్రమోషన్ల జోరు పెంచుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.