ఆంధ్రప్రదేశ్: ఏపీలో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. 16 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6,49,275 మంది విద్యార్థులు హాజరుకానుండగా, వీరి కోసం 3,450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
తీవ్రంగా పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీరు, ప్రథమ చికిత్స సదుపాయాలు సిద్ధంగా ఉంచారు. పరీక్షా కేంద్రాల్లో వైద్య సిబ్బందిని కూడా నియమించినట్లు పేర్కొన్నారు.
విద్యార్థుల రవాణా సౌలభ్యం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అదనంగా, పదో తరగతి హాల్ టికెట్ చూపించిన విద్యార్థులు ఏ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు.
పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.